నా భర్త చివరి కోరిక నెరవేర్చండి: డాక్టర్‌ భార్య

చెన్నై: తన భర్త అంత్యక్రియలు సంప్రదాయం ప్రకారం జరిపించాలని కోవిడ్‌-19తో మృతి చెందిన డాక్టర్‌ సిమన్‌ హెర్క్యూల్స్‌ భార్య ఆనంది సిమన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి విజ్ఞప్తి చేశారు. సిమన్‌ చివరి కోరిక ప్రకారం కిల్‌పౌక్‌ శ్మశానవాటికలో ఆయనను ఖననం చేయాలని కోరారు. చెన్నైకి చెందిన న్యూరోసర్జన్‌ సిమన్‌ విధి నిర్వహణలో భాగంగా కరోనాతో మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించిన వైద్య సిబ్బందిపై స్థానికులు మూకదాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన మరో వైద్యుడు ప్రదీప్‌కుమార్‌.. అర్ధరాత్రి తానే స్వయంగా గుంత తవ్వి సిమన్‌ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. (వైద్యులకు భద్రత కల్పిస్తాం : అమిత్‌ షా)



ఈ విషాదకర ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కరోనాపై పోరులో ముందుండి నడుస్తున్న వైద్యులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. భారత వైద్య సమాఖ్య సైతం ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో సిమన్‌ భార్య ఆనంది సిమన్‌ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘కోవిడ్‌-19తో నా భర్త చనిపోయారు. ఒకవేళ మహమ్మారి నుంచి కోలుకోకపోయినట్లయితే మా సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన చెప్పారు. ఇదే ఆయన చివరి కోరిక. ప్రాణాంతక వైరస్‌ కట్టడిలో ముఖ్యమంత్రి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నా భర్త అంతిమ కోరికను కూడా నెరవేర్చండి’’అని ఆనంది కన్నీటి పర్యంతమయ్యారు. (కరోనా భయం: తమిళనాడులో అమానుషం)